ప్రయాణాలు - ఆట్లు : పోట్లు
మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటు-పోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమి రోజు పనులు ఏవి కావు.
ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు. వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు. మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు. మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.
మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు... ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో క్రింది విధంగా శాస్త్రాలు వివరించాయి. దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.
1. విదియ, తదియ రోజులల్లో కార్య సిద్ధి, భద్ర, జయ తిధులు మంచివి అన్నది ఇక్కడ విశేషం. ఆ రోజున తూర్పు, ఉత్తర దిశగా మాత్రమే ప్రయాణించాలి.
2. పంచమి నాడు శుభం. దశమిరోజు ధనలాభం. వీటినే పూర్ణ తిధులు అంటారు.
3. సప్తమి నాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి.
4. ఏకాదశి కన్య లాభ మంత సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.
5. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు. చేసేది ప్రయాణం కనుక స్థిరం పనికి రాదు, చర లగ్నమైతే మంచిది.
6. సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్ర వారాలు శుభ ప్రదం.
7. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి.
8. శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది నంద తిధి కనుక దోష పరిహారముతో సమస్యను అధిగమించవచ్చు. సమస్య తీవ్రత తూర్పుకు ప్రయాణించేవారికి ఉంటుంది.
9. చవితినాడు ఆపదలు వచ్చే అవకాశం. బహుళ చతుర్ధి నాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది.
10. షష్ఠీ నాడు అకాల వైరాలు. నంద తిధులలో తూర్పు ప్రయాణం మంచిది కాదు.
11. అష్టమి నాడు అష్టకష్టాలు. జయ తిధులలో పడమర ప్రయాణం మంచిది కాదు.
12. నవమి నాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. - శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.
13. ద్వాదశి నాడు మహా నష్టాలు. భద్ర తిధులు దక్షిణ దిశ ప్రయాణం నిషిద్దం.
14. ప్రయాణమునకు పూర్తిగా పనికి రాని తిధులు .. చవతి, నవమి, చతుర్దశి వీటినే రిక్త తిధులు అంటారు.
15. మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది.
16. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. దీనినే వార శూలగా పేర్కుంటారు. ఈ రోజున సూర్యోదయాత్తు 3గం. 12 ని. వదిలిన వార శూల భంగ మగును. (8 ఘడియలు)
17. ఉత్తర దిశకు మంగళ, బుధ వారములు వార శూలగా చెప్తారు. కావున ప్రయాణం నిషిద్దం. ఆ రోజున 4గం. 48ని. సూర్యోదయం నుంచి వదిలితే శూల భంగము. (12 ఘడియలు)
18. గురు వారం నాడు దక్షిణ దిశగా ప్రయాణం చేయకూడదు. అదే గురు వారానికి వార శూల. తిధి మొదలు 8గం. 48 ని. (సూర్యోదయం నుంచి) వదిలితే వార శూల దోష భంగము. (22 ఘడియలు)
19. పడమర/పశ్చిమ దిశలకు ఆది, శుక్ర వారములలో ప్రయాణించకూడదు. సూర్యోదయం మొదలు 6 గం. విడిచిన దోష రాహిత్యము.(15 ఘడియలు, ఒక ఘడియకు 24 ని. లు :: 24 x 15 = 360 ని.)
20. శని వారము వార శూల భంగము కొరకు 8 ఘడియాల కాలం అనగా 3 గం. 12 ని. కాలము సూర్యోదయం నుంచి వదిలి ప్రయాణాలు ఆరంభిస్తే శుభం.
21. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమిలలో ప్రయాణాలు చేయకూడదు.
22. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.
23. అదేవిధముగా ఆగ్నేయమునకు శని, గురు వారములు, నైరుతి దిశకు సోమ, శుక్ర వారములు, వాయవ్య దిశకు ఆది, మంగళ వారములు, ఈశాన్య దిశకు బుధ, సోమ వారములు వార శూల అగును.
24. ప్రారంభం అయిన తరువాత తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం చేయరాదు. అలాగే తొమ్మిదవ రోజు ఇంటిలోకి ప్రవేశింపరాదు. అలాగే నవమి తిథి రోజున ప్రయాణం చేయరాదు అని శాస్త్ర వచనం.
25. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి మరియు త్రయోదశి అనే ఏడు తిధులు మాత్రమే యాత్రలకు శుభమైనది. ఆ రోజుల్లో చర లగ్నాల్లో ప్రయాణం ప్రారంభిస్తే శుభం.
26. పై తిధులు అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, మూల, శ్రవణ, ధనిష్ట, రేవతి నక్షత్ర రోజున వస్తే మరింత విశేషమైనది, శుభ ప్రదం.
27. విశేష కాలం కొరకు ప్రతి నక్షత్ర కాలములో నాలుగవ పాదాన్ని విడువ వలయును. కారణం ప్రతి నక్షత్రములో నాలగవది మోక్షానికి, వైరాగ్యమునకు ప్రతీతి.
( పైవి కాకుండా మీకు తెలిసినవి కూడా ఏవైనా అందిస్తే వీటితో జత చేయగలవాడను. )




